- ట్యాంక్‌బండ్‌పై జనజాతీయ గౌరవ దివస్ ర్యాలీ
హైదరాబాద్, వెలుగు: గత 75 ఏండ్లుగా మారుమూల గిరిజన గూడాలకు ఏ ప్రభుత్వ అధికారి వెళ్లలేదని, నక్సలైట్లు అడ్డుకోవడంతో అక్కడి ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందకుండా పోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నక్సలిజాన్ని నిర్మూలించి గిరిజన గూడాల్లో అభివృద్ధికి బాటలు వేయడం ప్రధాని మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్‌పై జనజాతీయ గౌరవ దివస్ ర్యాలీ నిర్వహించారు.
స్వామి వివేకానంద విగ్రహం నుంచి కొమురం భీమ్ విగ్రహం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కొమురం భీమ్ విగ్రహం వద్ద బిర్సా ముండా చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నక్సలైట్ల చేతుల్లో బాధితులుగా మిగిలిన వారికి పునరావాసం కల్పించడంతో పాటు, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించి గిరిజన ప్రాంతాలను ప్రగతి పథంలో నడిపించేందుకు కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు.
స్వాతంత్ర్య పోరాటంలో ఎంతోమంది గిరిజన వీరులు ప్రాణత్యాగం చేశారని, ఆ మహనీయుల స్మృతిలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను సైతం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని గుర్తు చేశారు. తాను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఒక చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా నిలిచానని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకులు బిర్సా ముండాను బంధించిన రాంచీలోని పాత సెంట్రల్ జైలును ఆయన పోరాట స్ఫూర్తిని, గిరిజనుల చరిత్ర, త్యాగాలను భావితరాలకు చాటే అద్భుతమైన స్మారక మ్యూజియంగా తీర్చిదిద్దామని వెల్లడించారు.
గిరిజనులను మోసం చేసిన సర్కార్: రాంచందర్ రావు
తెలంగాణలో గిరిజనులకు గత ప్రభుత్వం గానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తీవ్రంగా మోసం చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. పోడు భూములను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, అమలులో జరుగుతున్న జాప్యాన్ని వీడి గిరిజనులకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నాటి బిహార్, నేటి జార్ఖండ్ ప్రాంతంలో జల్, జంగల్, జమీన్ హక్కుల కోసం బ్రిటిష్ పాలనపై వీరోచితంగా పోరాడిన బిర్సా ముండా, ఆదివాసీల హృదయాల్లో భగవాన్‌గా నిలిచారని కొనియాడారు. బ్రిటిష్, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీమ్ విగ్రహం సాక్షిగా ఈ వేడుకలు జరుపుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు.
